Sunday, March 27, 2016

శ్రీ కృష్ణ నవ పుష్పాంజలి



కృష్ణయ్యా కృష్ణయ్యా ఇదిగో ఇది నీ వరసయ్యా |
కృష్ణయ్యా కృష్ణయ్యా ఇదిగో ఇది నీ వరసయ్యా ||

పుట్టినపట్టునె తలిదండ్రులకు పరమాత్ముడవని చూపావు |
దానవులగు కంసాదులకు మరణభయమ్మే ప్రకటించావు || కృష్ణయ్యా || 1 ||

నందుని ఇంట పెరిగావు - నవనీతచోరుడవై తిరిగావు |
అద్భుత దామోదర-లీల! యశోదబాలా గోపాలా || కృష్ణయ్యా || 2 ||

గోవుల కాయుచు బ్రహ్మాదులకు నీవే పరమని చూపావు |
కొండను లీలగ పైకెత్తి ఇంద్రుని గర్వము దించావు || కృష్ణయ్యా || 3 ||

వేణువునూదుచు రాధను కూడి బృందావనమును గోలోకముగా |
రాసలీలలరమణుడవై పరమయోగమే చూపావు || కృష్ణయ్యా || 4 ||

బలరాముడు నీ తోడై రాగా అకౄరాదుల రక్షించి |
దానవులను పరిమార్చావు, మధురాధీశుడవైనావు || కృష్ణయ్యా || 5 ||

అష్టమి రాతిరి వరపుత్రుడవు, అష్టలక్ష్ముల ఇష్టవరుడవు |
అరవైనాలుగు కళలనిపుణుడవు - తలచిన కష్టముల్ బాపేవు || కృష్ణయ్యా || 6 ||

పిడికెడు అటుకులే మహరుచియనుచూ తరగని సంపదలిచ్చావు |
పిలచిన పలికే దైవమువై - మనసున కొలువై ఉన్నావు || కృష్ణయ్యా || 7 ||

ధైర్యము వీడిన విజయునకు గీతాజ్ఞానమునిచ్చావు |
జ్ఞానఘనుడు ఆ ఉద్ధవుకూ గోపకాంతలను చూపావు || కృష్ణయ్యా || 8 ||

అనంత కడలీ జీవనది ఒకటే హంసక్షేత్రమున |
అనంతవరదుని బింబముగా 'ప్రతిబింబమునూ' కలిపేస్తావు  || కృష్ణయ్యా || 9 ||

No comments:

Post a Comment