Friday, October 30, 2015

నరహరయే నమః

సత్యం విధాతుం నిజభృత్య భాషితం
వ్యాప్తిం చలోకేష్వఖిలేషు చాత్మనః |
అదృశ్యతాత్యద్భత రూపముద్వహన్
స్తంభే సభాయాం నమృగం నమానుషమ్ ||

శ్రీమద్భావతంలో నరసిమ్హావత ఘట్టాన్ని వర్ణించే శ్లోకం ఇది.
తన నిజమైన సేవకుడి మాటను నిలబెట్టటానికి సర్వలోకములయందు వ్యాపించినవాడై అత్యద్భుత మృగమూ మనిషీకాని రూపాన్ని ధరించి సభామంటపమునందలి స్తంభములో దర్శనమిచ్చాడు భగవంతుడు - అని ఈ శ్లోక తాత్పర్యము.

శృంగేరీ దక్షిణామ్నాయ శ్రీశారదా పీఠ ప్రస్తుత ఉత్తరాధికారి, 37వ జగద్గురువులు అయిన శ్రీ విధుశేఖరభారతీ స్వామివారు, తమ పూర్వాశ్రమంలో ఈ శ్లోకం మీద అద్భుతమైన వ్యాఖ్యానాన్ని వ్రాసి తమ గురువైన జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి ఆశీరభినందనలు పొందారు.

ముఖ్యంగా "నిజభృత్య" అన్న పదానికి అనేక అర్థాలను సూచించి వేదవ్యాసులవారి అనుపమాన కవితా సౌందర్యాన్ని, శ్రీమద్భాగవతంలో అణువణువునా నిండి నిబిడీకృతమై ఉన్న భగవత్కారుణ్య దివ్య వైభవాన్ని తెలియజేశారు.

ఆ అర్థాలు ఇవి:
1. "ఇందుగలడందులేడని..." అని నొక్కి వక్కాణించిన ప్రహ్లాదుడు నిజభృత్యుడు.
2. హిరణ్యకశిపుడు తపస్సుతో మెప్పించి తన చావు లోకంలో కనపడే ఏ విధమైన ప్రాణివల్లనూ ఏ విధమైన ప్రదేశంలోనూ, ఏ నిర్దిష్ట కాలంలోనూ రాకూడదని కోరుకోగా "తథాస్తు" అన్న బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణుని నిజభృత్యుడే కదా!
3. బ్రహ్మ మానసపుత్రులైన సనక-సనందనాదుల శాపంవల్ల రాక్షస జన్మలెత్తినా దేవదేవుడైన శ్రీమహావిష్ణువు చేతిలోనే చావాలని కోరుకున్న జయవిజయులు, నిక్కమైన నిజభృత్యులే కదా; ఆ విధంగా స్వహస్తాలలో హిరణ్యకశిపుణ్ణి చంపటానికి స్వామి రావటం "నిజభృత్యునికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటమే" కదా!

ఈ విధంగా ఒకే సమయంలో, ఒకే సన్నివేశంలో ఇన్నివిధాలుగా తన అవతారవైభవాన్ని అర్థవంతం చేసిన భక్తజనవత్సలుడు, అనంతకోటిబ్రహ్మాండనాయకుడైన శ్రియఃపతి శ్రీమన్నారాయణుణ్ణి సదా శరణుకోరి సేవించటమే సర్వోత్తమమైన భాగ్యం!

Thursday, October 29, 2015

నమోనమః సుందరతాండవాయ

మధురిపు విధి శక్ర ముఖ్య దేవైః - అపి నియమార్చిత పాదపంకజాయ |
కనకగిరి శరాసనాయ తుభ్యం - రజత సభాపతయే నమశ్శివాయ ||

శ్రీమహావిష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతాప్రముఖులు నియమముగా అర్చించు పాదపద్మములు కల మహాదేవుడు, బంగారుమయమైన పర్వతమును ధనుస్సుగా కలవాడు, రజతసభయందు ఆనంద తాండవము చేయువాడును అయిన పరమశివా నీకు నమస్కారము!


హాలాస్యనాధాయ మహేశ్వరాయ - హాలాహలాలఙ్కృత కంధరాయ |
మీనేక్షణాయాః పతయే శివాయ - నమోనమస్సుందరతాండవాయ ||

మధురాపురీశుడవైన మహేశ్వరా! హాలాహలము కంఠసీమను నీలమణిలా అలంకరించిన నీకు, మీనాక్షీనాథుడవైన శివా! పరమానందకర సౌందర్య తాండవా! నీకు నమస్కారము!!

Wednesday, October 28, 2015

హరయే నమః

శతం విహాయ భోక్తవ్యం - సహస్రం స్నానమాచరేత్ |
లక్షం విహాయ దాతవ్యం - కోటిం త్యక్త్వా హరిం భజేత్ ||